పురాతన బావిలో పూడిక తీసివేత

02-06-2026: కంచరపాలెం హైవే ధర్మానగర్ వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, స్థానికుల సహకారంతో “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా పురాతన బావిలో పూడికతీత కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సుమారు 75 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ కలిసి తవ్వుకున్న ఈ బావి, పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వాడుకలో లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. స్థానికుల విన్నపం మేరకు జేడీ ఫౌండేషన్ స్పందించి, స్థానికుల సహకారంతో బావిలోని పూడిక, వ్యర్థాలను తొలగించడం జరిగింది.

భవిష్యత్తులో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా, చుట్టుపక్కల ఉన్న డాబాలపై పడే వాన నీటిని బావిలోకి మళ్లించే ఏర్పాట్లు త్వరలో చేయనున్నారు. తద్వారా ఈ పురాతన బావి పునరుజ్జీవనం చెంది, భూగర్భ జలాల సంరక్షణకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా కాలనీ సభ్యులు యర్రా నాయుడు గారు మరియు మహిళలు మాట్లాడుతూ, పురాతన బావికి తిరిగి జీవం పోసేలా చర్యలు చేపట్టిన జేడీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలిశెట్టి రాజు గారు, పిల్లల రవి గారు, ఇతర కాలనీ సభ్యులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.


14-06-2026: ఈ రోజు 89వ వార్డు, విశాఖపట్నం యల్లపువానిపాలెం రామాలయం వద్ద “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా జేడీ ఫౌండేషన్ మరియు స్థానికుల సహకారంతో పురాతన బావిలో పూడికతీత కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

సుమారు 80 సంవత్సరాల క్రితం తాగునీటి అవసరాల కోసం తవ్విన ఈ బావి, కాలక్రమేణా వాడుకలో లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాలు, బిల్డింగ్ వ్యర్థాలతో నిండిపోయింది. స్థానికుల విన్నపం మేరకు స్థానిక నివాసులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు కలిసి బావిలో పేరుకుపోయిన చెత్తను పెద్ద మొత్తంలో తొలగించడం జరిగింది.

ఇప్పటివరకు నగరంలో మూడు పురాతన బావుల్లో పూడికతీత కార్యక్రమాలు నిర్వహించినట్లు సంఘ సభ్యులు తెలిపారు. “వర్షపు నీటిని ఒడిసి పడదాం – భూగర్భ జలాలను పెంపొందిద్దాం!” అనే నినాదంతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గొర్ల అప్పలరాజు గారు, లంకె అప్పలరాజు గారు, గవ్వ భాస్కర్ గారు, స్థానికులు మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader