బాలాజీ హై స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ

29-06-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపాలపట్నంలోని బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులతో విత్తన బంతుల తయారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ముందుగా విత్తన బంతుల ఆవశ్యకత, వాటి తయారీ విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జేడీ ఫౌండేషన్ సేకరించిన దేశీ విత్తనాలైన చింత, కుంకుడు, తురాయి, గంగరావి, సీతాఫలం, సపోటా, మారేడు, కానుగ, బొప్పాయి తదితర విత్తనాలతో విద్యార్థులతో విత్తన బంతులను తయారు చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కే. భాను గారు మాట్లాడుతూ, విత్తన బంతుల ద్వారా సామాజిక వనాలను పెంచడంతో పాటు, విద్యార్థులను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం మంచి పరిణామమని తెలిపారు.

పిన్నమనేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, దేశ, విదేశాల్లో సైతం విత్తన బంతుల ఆవశ్యకతను గుర్తిస్తున్నారని, కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు వంటి ప్రదేశాల్లో వీటిని వెదజల్లడం ద్వారా సహజంగా మొక్కలు పెరిగేలా చేయవచ్చని తెలిపారు.

విత్తన బంతుల తయారీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రాయోగిక అవగాహన కల్పించడంతో పాటు, ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించవచ్చని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన విత్తన బంతులను సరైన ప్రదేశాల్లో వినియోగించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని మొక్కలు, చెట్లు పెరిగేందుకు దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులతో పాటు పిజికల్ డైరెక్టర్ సంతోష్ గారు, ఎస్.వి. లక్ష్మీ గారు, ఇతర సిబ్బంది మరియు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader